
తమిళనాడులో కొత్త శకం మొదలైంది. ద్రవిడ కోటలో దశాబ్దాల రాజకీయ చరిత్రను తిరగరాశారు దళపతి, టీవీకే అధినేత విజయ్. పార్టీ పెట్టిన కొంతకాలంలోనే అధికార పగ్గాలను అందుకున్నారు. పాలన చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్క్ వేస్తున్న విజయ్.. కేబినెట్ లోని మంత్రులకు శాఖలను కేటాయించారు. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
తమిళనాడు రాజకీయ చరిత్రలో దశాబ్దాల తరువాత తొలిసారిగా నటుడు జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాదాపు 59 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. తమిళనాడు ప్రభుత్వంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ భాగస్వామ్యమైంది. నిజానికి 1954 ఏప్రిల్ 13 నుంచి 1963 అక్టోబర్ 2 వరకు ఆ పార్టీ నేత కామరాజ్ సీఎంగా ఉన్నారు. ఆ తరువాత కాంగ్రెస్ ఉనికి లేకుండా పోయింది. ప్రస్తుతం ఐదుగురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ టీవీకేకు మద్ధతు ఇవ్వడంతో ప్రభుత్వంలో భాగస్వామ్యం అయింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజేశ్ కుమార్, విశ్వనాథ్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
నిజానికి ఇది తమిళనాడు రాజకీయాలకు అస్సలు అలవాటు లేని విషయం. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడూ ఒకే పార్టీ పెత్తనం చెలాయించేది. దీని వల్ల తమిళనాట అధికారాన్ని పంచుకునే పరిస్థితులు రాలేదు. కానీ ఇప్పుడు విజయ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఒక్కమాటలో చెప్పాలంటే తమిళనాడులో విజయ్ సర్కార్ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. 35 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు ఉండగా.. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న వీసేకే, ఐయూఎంఎల్ పార్టీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వన్నియరసు, షాజమాన్ కూడా మంత్రులుగా ఉన్నారు. ఇది నిజంగా రాష్ట్ర అధికార స్వరూపాన్ని తిరగరాసే ఒక చారిత్రాత్మక మార్పు అనే చెప్పాలి.
ఇక్కడ ప్రధాన విషయం ఏకంగా 59 ఏళ్ల రాజకీయ అజ్ఞాతవాసం తరువాత జాతీయ పార్టీ కాంగ్రెస్ తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. దశాబ్దాల అధికార పంపిణీకి తెరదించుతూ.. సీఎం విజయ్ మంత్రివర్గంలో రాజేశ్ కుమార్, విశ్వనాథన్ మంత్రులుగా ప్రమాణం చేశారు. సుమారు ఆరు దశాబ్దాలుగా ఆ పార్టీ అధికారంలో లేనప్పటికీ, ఒక రాజకీయ శక్తిగా కొనసాగుతూనే ఉండటం విశేషం. దీన్ని బట్టి తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి ఉన్న పట్టు ఎలాంటిదనే విషయం అర్ధం అవుతుంది. కారణాలు ఏమైనప్పటికీ.. ఇన్నేళ్లు మాత్రం కాంగ్రెస్ అధికారాన్ని అందుకోలేకపోయింది.
అయితే దీంతో తమిళనాడులో చెలరేగిన రాజకీయ తుఫాన్ ముగిసిపోలేదు. అధికార టీవీకేతో కాంగ్రెస్ పొత్తును ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ డీఎంకే వెన్నుపోటుగా అభివర్ణిస్తోంది. ఈ క్రమంలోనే కొత్త కూటమిలోని స్థిరత్వంపై ప్రశ్నలు సంధిస్తూ.. తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. అంతేకాదు వాళ్ల స్వార్థ రాజకీయాలను ప్రజలు గుర్తిస్తారని, ప్రస్తుత విజయ్ కూటమి ప్రభుత్వానికి త్వరలోనే సరైన గుణపాఠం చెబుతారని ధీమా వ్యక్తం చేస్తుండటం విశేషం. అయితే ఇన్నేళ్లు డీఎంకేతో కూటమిగా ఉన్న కాంగ్రెస్ ఇటీవల బయటకు వచ్చి, టీవీకేకు మద్ధతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ను ద్రోహిగా చూస్తోంది డీఎంకే. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ..తమిళనాట కొత్త రాజకీయ శకం మొదలైందనే చెప్పాలి.
మరోవైపు.. సీఎం విజయ్ చుట్టూ చాలా వివాదాలు ఉన్నాయి. లోక్ భవన్ లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మొదట వందేమాతరం, చివరగా తమిళ రాష్ట్ర గీతం పాడటంపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు ఆయన మంత్రివర్గ ఎంపికలోనూ మరీ ముఖ్యంగా ఆర్థిక శాఖా మంత్రి మారి విల్సన్ విషయంలో వివాదాలు చోటు చేసుకున్నాయి.
తమిళనాడులో ఇప్పటివరకు రీల్ సూపర్ స్టార్ గా ఉన్న విజయ్ ఇప్పుడు రియల్ సూపర్ స్టార్, ముఖ్యమంత్రిగా మారారు. అధికారాన్ని చేపట్టిన ఆయన తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా పాలనలో పారదర్శకత చూపిస్తూ, జవాబుదారీతనాన్ని కలిగి ఉండటం విశేషం. విజయ్ అధికారాన్ని అందుకుని రెండు వారాలు కూడా కాకముందే .. రాజకీయ విమర్శల వర్షాన్ని ఎదుర్కొంటున్నారు. మొదటి వారంలో నాలుగు వివాదాలు తెరపైకి వచ్చాయి. దీంతో యుద్దానికి రంగం సిద్ధమైంది. తొలి వివాదానికి కారణం… ప్రమాణస్వీకార కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర గీతాలాపన. విజయ్ తన కూటమి భాగస్వాములను మంత్రివర్గంలోకి తీసుకున్న తరువాత వారి ప్రమాణస్వీకార కార్యక్రమ నియమావళిపై ఈ వివాదం చెలరేగింది. నెక్ట్స్ తమిళనాడు ఆర్థికమంత్రి విల్సన్ నియామకం. ఆయన హింసకు పాల్పడుతున్నట్లు ఉన్న ఓ వీడియోను డీఎంకే సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో వివాదం రాజుకుంది. విజయ్ ప్రభుత్వ నిర్ణయంపై ప్రశ్నలు తలెత్తాయి.
ఈ నెల 18న ముల్లివైక్కల్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం విజయ్ ఈలం తమిళులకు నివాళులు అర్పించారు. శ్రీలంక అంతర్యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను, ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ ను స్మరించుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే విజయ్ ప్రభుత్వం తీవ్రవాద రాజకీయాలను ప్రోత్సాహిస్తుందని బీజేపీ ఆరోపించింది. ఇక నాలుగో వివాదం.. కాంచీపురంలోని నీటి ట్యాంక్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రభుత్వ టెండర్ చుట్టూ రాజుకుంది. కాంట్రాక్టర్లు బిడ్లు సమర్పించడానికి కేవలం 6 గంటల గడువు ఇవ్వడాన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించాయి. ఈ ప్రక్రియ మొత్తం ఒక వర్గానికి అనుకూలంగా ఉండేలా రూపొందించబడిందని ఆరోపించాయి. అధికారంలోకి వచ్చిన కేవలం రెండు వారాలకే, దళపతి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ వేడి రాజేస్తుంది.
ఇదిలా ఉంచితే.. మరో ఇంట్రెస్టింగ్ చర్చ ఒకటి జోరందుకుంది. తమిళనాడులో ఉన్న విజయ్ ప్రభుత్వం కేరళలో కూడా పాగా వేయడానికి ప్రయత్నిస్తుందనే వాదన తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే కేరళలో కూడా ఇటీవల కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కానీ ఆ ప్రమాణస్వీకార కార్యక్రమానికి విజయ్ హాజరు కాలేదు. అంతేకాదు కేరళలో టీవీకే ఇప్పటికే సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ప్రారంభించింది. బహుశా 2031 నాటికి పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు కావొచ్చు. ఈ క్రమంలోనే టీవీకే నెక్ట్స్ టార్గెట్ కేరళ రాష్ట్రమేనా.?అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మొత్తంగా ముఖ్యమంత్రిగా ఒక సినీ సూపర్ స్టార్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి దృష్టి అతనిపైనే ఉంటుంది. సచివాలయంలో విజయ్ కుర్చీపై ఉన్న తెల్ల టవల్ ను తొలగించడం అయినా, సీఎం స్వయంగా జీప్ ను నడపడమైనా … సాధారణ ప్రభుత్వ ఉద్యోగి తరహలో ఇంటినుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవడమైనా.. సరే ఇవన్నీ నెట్టింట వైరల్ గా మారాయి. అంతేకాదు పాలనలో విజయ్ మార్క్ ను చూపిస్తున్నాయి.
